ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత
– తాండూరు ఎమ్మెల్యే, వికారాబాద్ జిల్లా ఎస్పీ
– జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ర్యాలీ
– నిబంధనల పాటించడంపై అవగాహాన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత అని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రాలు అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం తాండూరు పట్టణంలో అలైవ్ అరైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రాలు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పిస్తూ పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు కళాశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ చిన్న తప్పిదాలు, అజాగ్రత్తల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, దీని వల్ల ఎన్నో కుటుంబాలు వేధనకు గురవుతున్నాయని అన్నారు. ప్రయాణంలో ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాల నిబంధనలు పాటించాలని అన్నారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి, మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, రోడ్ల సమస్యలను పరిష్కారానికి శ్రద్ధ వహించడం జరుగుతుందని అన్నారు.

అదేవిధంగా జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసు శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని అన్నారు. వాహదానులు బైకు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీటు బెల్టులు ధరించాలని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలను నడపరాదన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత అని అన్నారు. రోడ్డు నిబంధనలపై ప్రతి ఒక్కరు ఇతరులకు అవగాహాన కల్పించాలని అన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగస్వాములు కావాలని అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, ఐఎంఏ అధ్యక్షులు డా. జయప్రసాద్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాల. గాజుల మాధవి, సీఐలు సంతోష్ కుమార్, ప్రవీణ్ కుమార్. ఎస్ఐలు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

