సాయి’పుర‘(కే) ‘చైర్మన్‘ గిరి..!
– ఫస్ట్ లేడీగా పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి..?
– అబ్దుల్ రజాక్‌కు వైస్ చైర్మన్ కన్ఫామ్
– పచ్చజెండా ఊపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– రేపు మున్సిపల్‌లో ప్రమాణ స్వీకారోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రెండు రోజులుగా కొనసాగుతున్న తాండూరు మున్సిపల్ చైర్మన్ పదవిపై ఉత్కంఠతకు తెరపడింది. పట్టణంలోని సాయిపూర్‌కే చైర్మన్ గిరిని ఇచ్చేందుకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరుసగా మూడో సారి కౌన్సిలర్‌గా గెలిచిన పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డినే ఫస్ట్ లేడీగా డిక్లేర్ చేశారు. వైస్ చైర్మన్‌గా మైనార్టీ కోటాలో మరో హాట్రిక్ కౌన్సిలర్ అబ్దుల్ రజాక్‌ను కన్ఫాఫ్ చేశారు.

తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ కావాలని పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి ఎన్నో కలలు కన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి ప్రథమ మహిళగా నిలవాలని ఆశించారు. ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పుతో 424 ఓట్ల మెజార్టీ సాధించడంతో చైర్మన్ గిరిపై పెట్టిన గురి తప్పలేదు. రెండు రోజులుగా మున్సిపల్ చైర్ పర్సన్‌గా పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డిని ఎంపికపై పలు పుకార్లు వచ్చాయి. ఇప్పటికే ఆమె భర్త పట్లోళ్ల బాల్ రెడ్డి మార్కెట్ కమిటి చైర్మన్‌గా కొనసాగుతుండగా రెండు పదవులు అదే కుటుంబానికి ఎలా ఇస్తారని అభ్యంతరాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయన సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డికి నమ్మకస్తుడు అయిన బంటు వేణుకు ఇస్తారనే వార్తలు వచ్చాయి. వీటన్నింటికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెక్ పెడుతూ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డిని చైర్ పర్సన్‌గా ఎంపిక చేసినట్లు తెలిసింది. మైనార్టీ కోటాలో అబ్దుల్ రజాక్‌ను వైస్ చైర్మన్‌గా ఎంపిక చేశారు.

రేపు ప్రమాణ స్వీకారం…
తాండూరు మున్సిపల్ చైర్మన్‌పై ఏర్పడిన ఉత్కంఠతకు తెరపడడంతో రేపు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికారులు కూడా అధికారికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే గెలిచిన కౌన్సిలర్ల నుంచి నామినేషన్ తీసుకోవడం జరిగింది. మరోవైపు ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు క్యాంపులో ఉండగా రేపటి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వారిని కూడా తాండూరుకు తరలిస్తున్నారు. క్యాంపు నుంచి వచ్చిన కౌన్సిలర్లు కూడా పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

చేతులెత్తే విధానంలో ఎంపిక
తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గ ప్రమాణ స్వీకార ఏర్పాట్లను డీఆర్వో మంగిలాల్ పర్యవేక్షిస్తున్నారు. సోమవారం కార్యాలయంలో ఆయన పర్యవేక్షణలో పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ముందుగా కౌన్సిలర్లుగా ఎన్నికైన వారి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లను ఎన్నుకుంటారు. చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికను చేతులు ఎత్తే విధానంలోనే ఎన్నుకుంటారు. మెజార్టీ ప్రకారంగా చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక జరగబోతోంది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా ఎక్స్‌అఫీషియో హోదాలో ఓటును వినియోగించుకోనున్నారు.

