ఇందిరమ్మ కాలనీలో దారుణం
– కుమారుడికి ఉరేసిన తల్లి
– ఆపై తాను కూడా బలవన్మరణం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీలో దారుణం జరిగింది. ఓ తల్లి కుమారుడు కుమారుడికి ఉరేసి.. తానుకూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.

యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీలో బ్లాక్ నంబర్ 28లో బుడిగజంగం గౌరమ్మ (30) తన నాలుగేళ్ల కుమారుడు రవికాంత్‌తో కలిసి జీవనం సాగిస్తోంది. ఆమె తల్లిదండ్రులు కూడ అదే బ్లాక్‌లోని రూమ్ నంబర్ 1లో ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా గౌరమ్మ సమస్యలతో సతమతం అవుతోంది. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఇంట్లో ముందుగా తన కుమారుడుకు ఉరేసి.. ఆపై తానుకూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కనిపిస్తోంది.

సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో గౌరమ్మ సోదరుడు తుల్జారాం ఇంటికి వచ్చి చూడగా తలుపు లోపలి నుండి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా పలకకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూశారు. వెంటనే పోలీసులకు సమచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే గౌరమ్మ జీవితంపై విరక్తి చెందడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, ఆమె మరణాలపై తమకు ఎలాంటి అనుమానం లేదని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. మృతురాలి తల్లి పోచమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాలాల పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు.


