కాంగ్రెస్ పార్టీకి అదరం.. బెదరం..!
– 100కేసులైనా వెనక్కి తగ్గేది లేదు
– నంగనాచీ, ఊసరవెళ్లి తాండూరు ఎమ్మెల్యే
– అరాచక రాజకీయాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్
– మున్సిపల్ హామిలను నెరవేర్చకుంటే నిలదీస్తాం
– కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలి
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న అరాచక రాజకీయాలకు అదరం.. బెదరం.. అని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ద్వజమెత్తారు. 100 కేసులు నమోదు చేసినా అధికార పార్టీ చేస్తున్న కుట్రలను నిలదీస్తామని నిప్పులు చెరిగారు.

సోమవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో రోహిత్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాండూరు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. ఓ పెద్దాయన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీరును తనతో పంచుకున్నారని తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నంగనాచీ ఎమ్మెల్యే అని అన్నారని, ఇన్నేళ్లలో ఎవ్వరు చేయని అరాచకాలు, దౌర్జన్యాలు చేశారని, డేంజర్ ఎమ్మెల్యేగా ఉన్నారని తనతో చెప్పినట్లు వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు, విత్ డ్రా, ఎన్నికలు, కౌంటింగ్ పరిణామాలలో అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల కిడ్నాప్‌లకు పాల్పడ్డారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భావనతో కర్ణాటక నుంచి ప్యాసింజర్ రైల్లో దొంగ ఓటర్లను దించి.. బోగస్ ఓట్లను వేయించారని అన్నారు. అయినా కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి 19వేల ఓట్లు వేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పోటీగా 6వార్డులలో కేవలం 50 ఓట్ల కంటే తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగిందని, 100 ఓట్ల కంటే తక్కువ మెజార్టీతో 2 వార్డులలో ఓడిపోవడం జరిగిందని వెల్లడించారు.

ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం కోల్పోయారు అనే దానికి ఈ లెక్కలే నిదర్శనమని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యే, ఆ పార్టీ నేతలు దొంగ హామీలకు తెరలేపారని అన్నారు. పట్టణంలో ప్రతి వార్డులో 200 ఇళ్లు, 2ఎకరాల స్థలం ఇప్పిస్తామని ప్రజలను మభ్య పెట్టారని అన్నారు. పోలీసులను, అధికారులను కార్యకర్తల్లాగా వినియోగించుకున్నారని అన్నారు. ఎన్నికల్లో, కౌంటింగ్ రోజు కాంగ్రెస్ పార్టీ నేతలను గట్టిగా ఎదుర్కొవడం జరిగిందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లే అధికారం రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, మంత్రులకే ఉండదని, కాని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 30 మంది నేతలతో లోపలికి వెళ్లారని అన్నారు. విషయం తెలిసి ప్రశ్నించేందుకు వెళ్లగా తోపులాట జరిగిందన్నారు. పోలీసులను ఎమ్మెల్యేకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా అని నిలదీయడం జరిగిందని గుర్తుచేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటను అసరాగా చేసుకుని తమపై కేసులు బనాయించారని అన్నారు. ఎన్ని బెదిరంపులు చేసినా కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు బెదిరేది లేదని అన్నారు. మరో 100 కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు హామి ఇచ్చిన విధంగా ప్రతి వార్డులో 200ల చొప్పున 7200 ఇళ్లు, 2 ఎకరాల స్థలంతో పాటు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీసుకవస్తామన్నా రూ. 1000 కోట్ల హామిని నెరవేర్చేవరకు నిలదీస్తామని అన్నారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రంలోకి నిబంధనలకు విరుద్దంగా వెళ్లిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని గుర్తుచేశారు. దీనిపై పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎన్నికల కమీషన్‌తో పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్, తాండూరు మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సిద్రాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు శోభారాణి, పరిమళ, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
పాదయాత్రగా బేయిల్ విచారణకు
మరోవైపు ఈనెల 13న కౌంటింగ్ కేంద్రంలో జరిగిన తోపులాటపై మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మరో 8 మందిపై నాన్ బెయిలేబుల్ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం పైలెట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బేయిల్ మంజూరు చేసింది.

ఈ మేరకు సోమవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో పైలెట్ రోహిత్ రెడ్డి, నేతలు బేయిల్ విచారణకు హాజరయ్యారు. అంతకుముందు పైలెట్ రోహిత్ రెడ్డి తన నివాసం నుంచి కేసులో ఉన్న నాయకులు , పార్టీ నేతలతో కలిసి పాదయాత్రగా వచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి, రోహిత్ రెడ్డికి అనుకూలంగా నేతలు నినాదాలు చేసుకుంటూ పోలీస్టేషన్ వద్దకు చేరుకున్నారు. నేతలు పెద్ద ఎత్తున రావడం పట్ల పోలీసులు భద్రత చర్యలు తీసుకున్నారు. పోలీస్టేషన్‌లోకి రోహిత్ రెడ్డి, కేసుకు సంబంధం ఉన్న నేతలను మాత్రమే లోపలికి అనుమతించారు. విచారణ పూర్తి అయ్యేంత వరకు పోలీస్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్టేషన్ వద్దకు రావడంతో రాజకీయ చర్చనీయాంశంగా మారింది. రోహిత్ రెడ్డికి నేతలకు కండిషన్ బేయిల్ మంజూరు అయినట్లు తెలిసింది. రూ. 25వేల జరిమానతో పాటు 8వారాల పాటు ప్రతి సోమవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటలలోపు పోలీస్టేషన్‌లో సంతకం చేయాల్సి ఉంటుందని సమాచారం.


