విడలేమంటూ వీడ్కోలు

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

విడలేమంటూ వీడ్కోలు
– శ్రీ సాయి మేధ విద్యాలయంలో పెవరెల్‌ పార్టీ
– మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం
– శుభాకాంక్షలు తెలిపిన కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పదేళ్ల పాఠశాల ప్రయాణం.. వెలకట్టలేని స్నేహాలు.. తల్లిదండ్రుల్లా విద్యాబుద్ధులు నేర్పిన గురువులు.. ఇవన్నీ ఒక ఎత్తైతే.., ఇప్పుడు ఆ గడప దాటి వెళ్తున్నామన్న బాధ మరో ఎత్తు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో ఆదివారం జరిగిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం అత్యంత భావోద్వేగాల మధ్య జరిగింది.​ 9వ తరగతి విద్యార్థులు ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఏర్పాటు చేసిన ఈ వీడ్కోలు సమావేశం కేవలం వేడుకగానే కాకుండా ఆత్మీయ కలయికగా మారింది. పాఠశాల ప్రాంగణంలో గడిపిన ప్రతి క్షణం విద్యార్థుల కళ్లముందు కదలాడాయి. తమను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల పాదాలకు నమస్కరిస్తూ విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు పలువురి కళ్లు చెమర్చాయి.

ఉపాధ్యాయులు నేర్పిన పాఠాలు త‌మ జీవితాలకు వెలుగునిస్తాయంటూ విద్యార్థులు ఉద్వేగంగా ప్రసంగించారు. తరగతి గదిలో సందడి, ఆటస్థలంలో కేరింతలు, భోజనాలు పంచుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు కౌగిలించుకుని వీడ్కోలు చెప్పుకున్నారు. రేపు పాఠశాల గంట మోగితే తాము ఇక్కడ ఉండమన్న ఆలోచన వారిని కలిచివేసింది. అయితే తమ సీనియర్ల భవిష్యత్ బంగారుమయంగా ఉండాలని 9వ తరగతి విద్యార్థులు ఆకాంక్షించి వారిని సాగనంపారు. వీడ్కోలు అంటే విడిపోవడం కాదు.. కొత్త శిఖరాలను అధిరోహించేందుకు చేసే మరో ప్రయాణం అని ఉపాధ్యాయులు విద్యార్థులను ఆశీర్వదించారు.

మహిళ ఉపాధ్యాయులకు ఘన సన్మానం…
మహిళా దినోత్సవం పురస్కరించుకొని పాఠశాల లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు, ఆయమ్మలకు కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఘనంగా సన్మానించారు. మహిళల గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు కోసం కృషి