భద్రేశ్వరునికి గజమాల..!
– 14 ఏండ్లుగా అంకరణకు సమర్పణ
– కోటం కుటుంబ సభ్యులు ఆనవాయితీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న భావిగి భద్రేశ్వరునికి గజమాల సమర్పణ భక్తిశ్రద్దలతో జరిగింది.

కోరిన కోర్కెలు తీర్చిన భద్రేశ్వరునికి భక్తులు వస్తు రూపేణా, ఆభరణా రూపేణా మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితి. తమ కుటుంబంపై కృప చూపిన భద్రేశ్వరునికి గత 14 సంవత్సరాలుగా తాండూరుకు చెందిన కోటం వీరప్ప కుటుంబ సభ్యులు మొక్కులు తీర్చుకునే సంప్రదాయ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ప్రతియేటా భద్రేశ్వర జాతర ఉత్సవాలలో ఈ కుటుంబ సభ్యులు భద్రేశ్వరునికి స్వామి పల్లకిసేవ అలంకరణకు భారీ గజమాలను సమర్పిస్తున్నారు.

ఈ సారి ప్రారంభమైన జాతర ఉత్సవాలలో కూడ కోటం వీరప్ప కుటుంబ సభ్యులు మొక్కు తీర్చుకున్నారు. 14వ సారి భద్రేశ్వరునికి భారీ గజమాలను సమర్పించారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు భద్రేశ్వరుని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం గజమాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కూడ భద్రేశ్వురునికి నాగాభరణం, వెండి రుద్రాక్ష మాలను సమర్పించడం జరిగిందని గుర్తుచేశారు. స్వామి కృపతో తమ కుమారులు ఉద్యోగంలో స్థిరపడ్డారని కోటం సిద్దలింగం తెలిపారు. కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న భద్రేశ్వరునికి గజమాల సమర్పించి మొక్కు తీర్చుకోవడం జరిగిందని తెలిపారు.


