అప్పు అడిగినందుకు అంతం..!
– తాండూరు మహిళల డబుల్ మర్డర్
– తోల్కట్ట ఫాం హౌస్ సమీపంలో జంట హత్యలు
– మిస్టరీ ఎలా బయటపడిందంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ తోల్కట్ట ఫామ్ హౌస్ సమీపంలో శనివారం వెలుగులోకి వచ్చిన మహిళల డబుల్ మర్డర్ కేసులు తాండూరు నియోజకవర్గంలో కలకలం రేపాయి.

దారుణ హత్యకు గురైన మహిళలు తాండూరు ప్రాంతానికి చెందిన వారు కావడంతో చర్చనీయాంశంగా మారింది. మిస్సింగ్ కేసులో అదృశ్యమైన మహిళలు దారుణ హత్యకు గురైనట్లు సంఘటనతో తాండూరు వాసులు ఉలిక్కి పడ్డారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు మున్సిపల్ పరిధి ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబీ బేగం గత మార్చి 24న అదృశ్యమైంది. అదేవిధంగా బషీరాబాద్ మండలం కాశింపూర్‌కు చెందిన అబేదాబేగం(54) ఈనెల 5న అదృశ్యం అయ్యింది. మహబూబీ బేగం మిస్సింగ్ కేసు యాలాల పోలీస్టేషన్‌లో నమోదు కాగా అబేదాబేగం మిస్సింగ్ కేసు బషీరాబాద్ పోలీస్టేషన్‌లో నమోదయ్యింది.

అదృశ్యమైన ఇద్దరు మహిళలు మోయినాబాద్ తోల్కట్ట ఫాంహౌస్ సమీపంలో దారుణ హత్యకు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైన ఇద్దరు మహిళలు మహబూబీ బేగం, అబేదా భేగంలు తెలిసిన వారికి వడ్డీ కింద డబ్బులు ఇచ్చేవారని పోలీసుల విచారణలో తేలింది. తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న మహబూబీ భేగంకు అదే ప్రాంతంలో ఉండే కరీమా భేగం, భర్త రెహమాన్, నయూంలకు కొంత డబ్బులు అప్పుగా ఇచ్చింది. అదేవిధంగా అబేదా భేగం కూడా వారికి డబ్బులు ఇచ్చింది. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని ఇద్దరు మహిళలు వారిపై ఒత్తిడి తెచ్చారు.

ముందుగా మహబూబీ భేగంను అప్పు చెల్లిస్తామని, డబ్బులు తీసుకునేందుకు మోయినాబాద్ రావాలని పిలుపించుకున్నారు. అక్కడి నుంచి తోల్కట్ట ఫాం హౌజ్ సమీపంలోని ప్రభుత్వ స్థలానికి తీసుకెళ్లి ఆమెను దారుణంగా హత్య చేశారు. అదే తరహాలో ఈనెల 5న మిస్సింగ్ అయిన అబేదా భేగంను కూడా హత్య చేశారు. ఈనెల 9న అబేదా భేగం మిస్సింగ్ కేసును పోలీసులు దర్యాప్తు చేపట్టగా నయూమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో భాగంగా అబేదాభేగంను కరీమా భేగం, రెహమాన్‌లతో కలిసి హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. అదేవిధంగా మహబూబీ భేగంను కూడా హత్య చేసినట్లు విచారణలో తెలిపారు. దీంతో తాండూరులో మిస్సింగ్ అయిన మహిళలు దారుణ హత్యకు గురైట్లు వెలుగులోకి వచ్చింది. శనివారం ఉదయం నుంచి తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది విచారణలో నిమగ్నం అయ్యారు.


