అక్రమ రవాణాకు అడ్డుకట్ట..!
– జిల్లాలో అంతర్ రాష్ట్ర, జిల్లా చెక్ పోస్టులు
– సోషల్ మీడియాపై ప్రత్యేక పర్యవేక్షణ
– విద్వేషాలు రెచ్చగొడితే చట్టపరమైన చర్యలు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో ఆవులు, దూడల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలకు సిద్దమైంది.

ఆక్రమ రవాణా ఆటలు సాగకుండా జిల్లాలో అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు, అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలను పటిష్టంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ, పశుసంవర్థక శాఖల సంయుక్త సమన్వయంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో కొ ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అధ్యక్షత వహించగా, పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి సదానంద్, సంబంధిత అధికారులు, పోలీస్ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.జిల్లాలో ఎక్కడైనా చట్ట విరుద్ధంగా ఆవులు, దూడలను అక్రమంగా రవాణా చేసి వధించడం పూర్తిగా నిషేధమని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

ఇతర రాష్ట్రాలు మరియు జిల్లాల నుండి జంతువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు కొత్లాపూర్, రావులపల్లి, బషీరాబాద్ రైల్వే గేట్ వద్ద 3 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, అలాగే అంగడి చిట్టంపల్లి, మైతాబ్ ఖాన్ గూడ, అంతరం, లక్ష్మీనారాయణపూర్ క్రాస్ రోడ్ ప్రాంతాల్లో 4 అంతర్ జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, మొత్తం 7 చెక్‌పోస్టుల వద్ద 24 గంటల నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి చెక్‌పోస్టులో పోలీస్ సిబ్బందితో పాటు పశుసంవర్థక శాఖ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు కఠినంగా చేపడుతున్నట్లు వెల్లడించారు.
సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, ఫేస్బుక్ తదితరాల్లో పశువుల అక్రమ రవాణాకు సంబంధించి విద్వేషాలను రెచ్చగొట్టేలా మార్ఫింగ్ ఫోటోలు, అసత్య ప్రచారాలు, ప్రేరేపిత పోస్టులు పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం జిల్లా పోలీస్ మీడియా మానిటరింగ్ సెల్ నిరంతర నిఘా ఉంచిందని తెలిపారు.

ప్రజల్లో భయాందోళనలు కలిగించే రూమర్లు వ్యాప్తి చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. బక్రీద్ పండుగను పరస్పరం మతాలను గౌరవించుకుంటూ, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటానికి ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, డీసీఆర్బీ డీఎస్పీ జనయ్య, డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, తాండూరు డీఎస్పీ యాదయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


