కోర్టు ఆదేశాలను తప్పుదోవ పట్టించొద్దు
– కాంగ్రెస్ నేతలపై ఉల్లంఘన కేసులు వేస్తాం
– గొంతు నొక్కాలని చూస్తే ఊరుకోం
– మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యేపై నమోదైన ఎఫ్ఆర్ఐ నమోదు విషయంలో కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టించడం పద్దతి కాదని బీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ అన్నారు.

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సమయంలో కేంద్రంలోకి వచ్చిన ఎమ్మెల్యే, అనుచరులపై కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు. అయితే దీనిని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారాన్ని చేయడాన్ని ఖండించారు.

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమీషన్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదులు చేస్తే పట్టించుకోకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే, అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సక్రమంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించిదని అన్నారు.

కోర్టు ఆదేశాలను కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలపై తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న న్యాయవాది నేతపై, కాంగ్రెస్ నాయకులపై కోర్టులో ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.అధికార పార్టీ అండతో విర్రవీగుతూ ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.


