మహారాణా ప్రతాప్ చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి
– ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
– తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహనీయుడు మహారాణా ప్రతాప్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

శనివారం తాండూరు రాజ్ పుత్ సమాజం ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హాజరై మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి బీసీ కమీషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు తదితరులతో కలిసి మహారాణా ప్రతాప్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 600 ఏండ్ల క్రితం భారతదేశంలో జరిగిన దండ యాత్రల్లో శత్రువులను చీల్చి చెండాడిన ధీరుల గురించి ప్రతీ ఇంట్లో తెలుసుకోవాలని సూచించారు.

మాతా జీజియాబాయి తన కొడుకును ధీరుడిగా తీర్చిదిద్దారని, రాణీ జైవంత బాయి కూడా తన కొడుకు రాణా ప్రతాప్ ను హిందువుల ఆత్మగౌరవం నిలిపేలా శత్రువులను ఎదుర్కొనేలా తీర్చిదిద్దారని కొనియాడారు. పాఠ్య పుస్తకాలలో మహారాణా ప్రతాప్‌తో పాటు హిందూ వీరుల గురించి పొందు పర్చాలన్నారు. తాండూరులో ఓ లైబ్రరీ ఏర్పాటు చేసి వారి జీవిత గాధల పుస్తకాలు అందజేస్తానని తెలిపారు.

బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ లేని విధంగా రాణా ప్రతాప్ జయంతి తాండూరులో జరుపుకోవడం అభినందనీయం అన్నారు. రాజ్ పుత్రులను ఓబీసీ జాబితాలో చేర్చాల్సిన బాధ్యత కేంద్రం పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, పర్యాద రామకృష్ణ, ఠాకూర్ సూరజ్ సింగ్, దిలీప్ సింగ్, అజయ్ ప్రసాద్, రమేష్ సింగ్, దినేష్ సింగ్, సుభాన్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


