ధాన్యం ఇబ్బందుల పరిష్కారానికి చొరవ చూపండి
– వైద్య ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తే మేలు
– వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ఇందిరమ్మ ఇళ్లపై స్పెషల్ సమీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో ధాన్యం రైతులకు ఇబ్బందులు రాకుండా పరిష్కారానికి చొరవ చూపాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు.

సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ దీపక్ తివారి గారిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భేటి అయ్యారు. ఈ సందర్బంగా తాండూరు నియోజకవర్గంలోని వరి ధాన్యం కొనుగోలు, వైద్యఆరోగ్యం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై జిల్లా అధికారులతో కలిసి సమీక్షించారు.

అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ధాన్యం నిల్వలు నిండుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్టాక్ పాయింట్ల నుంచి తరలింపు, ధాన్యం రైతులకు నిధులు త్వరగా జమ చేసే విధంగా అధికారులను అదేశించాలని విజ్ఞప్తి చేశారు.

దీంతో పాటు తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు, వైద్యుల ఖాళీలను భర్తి చేసేలా చూడాలని కోరారు. అంతేకాకుండా డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏసీఎల్బీ ఉమా శంకర్ ప్రసాద్, ఏసీ రెవెన్యూ వెంకటేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


