పెండింగ్‌ కేసుల పురోగతిపై దృష్టి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పెండింగ్‌ కేసుల పురోగతిపై దృష్టి
– ప్రతి రికార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి
– ప్రజలకు సత్వర న్యాయం అందించేలా చర్యలు చేపట్టాలి
– టెక్నాలజీని పెంచి రాత్రి గస్తీని కొనసాగించాలి
– వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా
– తాండూరు పోలీస్టేషన్‌లో తనిఖీ, రికార్డుల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీస్టేషన్‌లో పెండింగ్‌ కేసుల్లో పురోగతిని సాధించేలా దృష్టిసారించాలని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశించారు.

బుధవారం తాండూరు పట్టణంలోని పోలీస్టేషన్‌ను జిల్లా ఎస్పీ సందర్శించారు. సాధారణ వార్షిక తనిఖీలలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, కార్యాలయ నిర్వహణ, రికార్డుల భద్రత, సిబ్బంది విధి నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. ముఖ్యంగా స్టేషన్ డైరీలు, పెండింగ్ కేసుల పురోగతి, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, హిస్టరీ షీట్లు, ఆర్డర్ బుక్, బీట్ బుక్స్, వారెంట్ల అమలు స్థితిగతులతో పాటు స్వాధీనం చేసుకున్న ఆస్తుల రికార్డులు , కేసు ప్రాపర్టీల భద్రత వంటి పలు కీలక అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చొరవ చూపాలన్నారు. పోలీసులకు-ప్రజలకు మధ్య ఎలాంటి అంతరాలు లేకుండా నిరంతరం అందుబాటులో ఉండి అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్‌లో ఎలాంటి రికార్డులను పెండింగ్‌లో పెట్టకూడదని, ప్రతి రికార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల రక్షణ మరియు వారిపై జరిగే నేరాల కేసుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉంటూ, ప్రత్యేక నిఘా ఉంచాలని, బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

శాస్త్ర సాంకేతికతను జోడించి రాత్రి వేళల్లో గస్తీ నిరంతరం కొనసాగించాలని, పాత నేరస్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని పేర్కొన్నారు. పట్టణంలోని సమస్యాత్మక, ముఖ్యమైన ప్రాంతాలలో సీసీటీవీ కెమెరాల నిఘాను మరింత బలోపేతం చేయాలని అన్నారు. అదేవిధంగా రాబోయే ప్రతిష్టాత్మక బోనాలు, మొహర్రం పండుగలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ గారు శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. , జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు వచ్చే విధంగా పనిచేయాలని సిబ్బందికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో తాండూరు పట్టణ సీఐ బొంగు పరమేశ్వర్ గౌడ్, ఎస్‌ఐ లు, ఇతర సిబ్బంది తదితరులు ఉన్నారు.

మోడల్ మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి