కేటాయింపుకు సిద్దంగా డబుల్ బెడ్ రూంలు
– పారదర్శకంగా ఎంపిక చేసేందుకు దృష్టి
– అర్హులైన పేదలకే ఇండ్ల మంజూరు
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదలకు పంపిణీ చేయాల్సిన డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయింపుకు సిద్దంగా ఉన్నాయని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు.

శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తాండూరు నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూంల ఎంపిక ప్రక్రియపై జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. వెంకటాచారి, తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాథోడ్ దశరథ సింగ్, మునిసిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డిల సమక్షంలో రాండమైజేషన్ ద్వారా ఇండ్ల కేటాయింపు పై కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ తాండూర్ నియోజక వర్గంలో డబుల్ బెడ్ రూముల నిమిత్తం 8333 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 1001 డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాలు వివిధ దశలో ఉన్నాయన్నారు ప్రస్తుతం 581 ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఇండ్ల కేటాయింపులు ఎలాంటి అవకతవకలు తావు ర్యాండమైజేషన్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఆయన తెలిపారు.

ర్యాండమైజేషన్ ద్వారా ఎంపికైన లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత ఉన్నట్లు అయితే మాత్రమే ఇండ్ల కేటాయింపు జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అర్హత లేకుండా ఇండ్ల కేటాయింపు జరిగిందని తెలిసిన పక్షంలో ఫిర్యాదులను స్వీకరించి మరో దఫా విచారణ చేపడతామని కలెక్టర్ తెలిపారు. అర్హులైన పేదలకు ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.



