కరీమాబేగం మృతి..!
– జంట హత్యల కేసులో నిందితురాలు
– ఠాణాలో ఆత్మహత్యాయత్నం
– చికిత్స పొందుతూ కన్నుమూత
తాండూరు, దర్శిని ప్రతినిధి : మోయినాబాద్ ఫాం హౌస్ జంట హత్యల కేసులోని నిందితురాలు కరీమాభేగం మృతి చెందింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బందువులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలో సంచలనం సృష్టించిన తాండూరు జంట మహిళల దారుణ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కరీమా బేగం విచారణలో భాగంగా కరణ్ కోట్ పోలీస్టేషన్‌కు తరలించారు.

విచారణలో ఉండగా కరీమాభేగం బాత్రూంలోకి వెళ్లి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అదే రోజు పోలీసులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో 24 రోజులుగా చికిత్స పొందుతున్న కరీమాభేగం రాత్రి మృతి చెందినట్లు తెలిసింది.

మొయినాబాద్ జంట హత్య కేసులో కరీమాబేగంతో పాటు ఆమె భర్త రెహమాన్, నయూం అనే వ్యక్తి కూడా నిందితులుగా ఉన్నారు. వీరి పన్నాగంలో పడి మహబూబీ బేగం, అబేదా భేగం అనే మహిళలు హత్యకు గురయ్యారు. మరోవైపు ఠాణాలో కరీమాభేగం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో వికారాబాద్ జిల్లా ఎస్పీ ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. మహిళ కానిస్టేబుల్ సునీత, యాలాల పోలీస్టేషన్‌కు చెందిన బసవరాజులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇదిలా ఉండగా కరీమాభేగం మృతి చెందడంతో పలువురు బాధితులు పాపం పండిందని శాపనార్థాలు పెట్టారు.


