ఏండ్లుగా.. పాగా..!
– ఇంటెలిజెన్స్‌లో లేని ట్రాన్స్ఫర్లు
– ప్రభుత్వాలు మారిన మారని సిబ్బంది
– కొత్త నియామకాలపై ఊసెత్తని యంత్రాంగం
– రోజు రోజుకు పెరుగుతున్న విమర్శలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీసు శాఖ అత్యంత కీలక విభాగమైన ఇంటెలిజెన్స్ విభాగంపై తాండూరు సబ్ డివిజన్లో తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి.

గత పదేళ్లుగా ఇక్కడి విభాగంలో అధికారులు, సిబ్బంది విధుల్లో మార్పులు జరగకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 12 ఏండ్లు ముగుస్తున్నా.. సుమారు పదేళ్లలో ఇంటెలిజెన్స్ విభాగంలో బదీలీల ప్రక్రియలు చేపట్టక పోవడంపై అనుమానాలు వక్తమవుతున్నాయి.

నిజానికి ఏ ప్రభుత్వ ఉద్యోగికి అయినా 3 ఏండ్లలోపు బదీలీలు చేపట్టాలని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. కాని తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని ఇంటెలిజెన్స్ సిబ్బంది పదేళ్లుగా పాతుకు పోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో వారే పనిచేస్తున్నారని, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడంతో పారదర్శకత లోపిస్తోందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ట్రాన్స్ఫర్లు చేయకపోవడంతో వారు ఆడిందే.. ఆట.. పాడిందే పాటగా కొనసాగుతున్నట్లు కనిపిస్తోందని పెదవి విరుస్తున్నారు. ఏండ్లుగా పాత వారినే కొనసాగిస్తుండడంతో కొత్త వారికి అవకాశం దక్కడం లేదని అసంతృప్తి భావాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇంటెలిజెన్స్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రక్షాళన చేపట్టే విధంగా చూడాల్సిన అవకాశం ఉందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


