భవనం నుంచి కింద పడిన బాలిక
– ప్రమాదంలో విరిగిన రెండు కాళ్లు
– జినుగుర్తి హాస్టల్‌లో అర్దరాత్రి ఘటన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : హస్టల్ రెండో అంతస్తు నుంచి ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో కిందపడిపోయింది. బాలికకు రెండు కాళ్లు విరిగిపోగా.. వెన్నెముకకు గాయాలయ్యాయి.

ఈ సంఘటన తాండూరు మండలం జినుగుర్తి గురుకుల పాఠశాలలో ఆదివారం అర్దరాత్రి చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరిలా ఉన్నాయి. మైల్వార్ గ్రామానికి చెందిన మహేశ్వరి జినుగుర్తి గ్రామ సమీపంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది.

అయితే ఆదివారం అర్దరాత్రి సమయంలో మహేశ్వరి వసతి గృహం రెండో అంతస్తు నుంచి కిందపడిపోయింది. ఈ క్రమంలో బాలిక కాళ్లు విరిగిపోయాయి. గమనించిన సిబ్బంది బాలికను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు బాలికకు రెండు కాళ్లు విరిగిపోగా.. వెన్నెముకకు గాయమైనట్లు తెలిపారు.

మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు కుటుంభీకులు తెలిపారు. జరిగిన సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంభీకులు కోరారు. మరోవైపు గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటనపై కలకలం రేగింది. మహేశ్వరి ఎలా కిందపడింది.. ప్రమాదం ఎందుకు జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.


