క్యూఆర్ కోడ్‌లతో స్మార్ట్ రేషన్ కార్డులు..!
– లబ్దిదారుల పంపిణీకి సర్కారు నిర్ణయం
– కార్డుల జారీలో సాంకేతికతకు ప్రాధాన్యం
– ఇంకా ఎలాంటి విషయాలు ఉన్నాయంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ లబ్దిదారులకు మెరుగైన సేవలను అందిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఎంతో మంది పేదలకు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది.

దాదాపు 10 నుంచి 15ఏళ్లుగా రేషన్ కార్డులకు దూరంగా ఉన్న పేదలు సదుపాయాలను పొందుతున్నారు. పేదలకు అందిస్తున్న రేషన్ కార్డుల సేవల్లో పారదర్శకతను పాటించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని పేదలకు పాత రేషన్ కార్డుల స్థానంలో డిజిటల్ రేషన్ కార్డులను అందించాలని నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం రేషణ్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులను అందించబోతోంది. ఇవి సాధారణ ప్లాస్టిక్ కార్డు రూపంలో డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏటీఎం కార్డు వలె ఉంటాయి. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక భద్రత ఫ్యూచర్లతో కూడిన పివిసి స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ నుంచి వచ్చే ఆదేశాల కనుగుణంగా వీటిని త్వరలోనే లబ్ధిదారులందరికీ పంపిణీ చేయనున్నారు.

ఇందులో ఉండే ఫీచర్స్ ఇవే..
లబ్ధిదారులు తమ ఫోన్ల ద్వారా రేషన్ వివరాలను కోటాను సులభంగా ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు. ఈ స్మార్ట్ కార్డుపై కుటుంబ వివరాలు, అర్హతలు, ఆధార్ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. కార్డు మీద ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల బియ్యం ఇతర సరుకుల పంపిణీలో ఇలాంటి అక్రమాలు జరగవు. ఓకే కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువ కార్డు ఉండడం, తప్పుడు వివరాలతో ప్రయోజనాలు పొందడం వంటి అక్రమాలకు అవకాశం తగ్గుతుంది. భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేయడానికి కూడా ఈ స్మార్ట్ కార్డు ఎంతోగాని ఉపయోగపడే అవకాశం ఉంది.


