సిరిధాన్యాలతో ఆరోగ్య పరిరక్షణ
– ఉత్పత్తుల తయారిపై అవగాహన పెంచుకోవాలి
– తాండూరు వ్యవసాయ శాస్త్రవేత్తలు
– పరిశోధన స్థానంలో పారిశ్రామికవేత్తలకు శిక్షణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : సిరిధాన్యాలతో పోషకల విలువలు పెంపుతో పాటు ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని తాండూరు ఫ్రోఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం(పీజేటీఏయూ) శాస్త్రవేత్తలు అన్నారు.

బుధవారం వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో అగ్హబ్ లైవ్లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్ ఆధ్వర్యంలో సిరిధాన్యాల ప్రాథమిక ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారి, మార్కెటింగ్‌పై పారిశ్రామికవేత్తలకు రెండు రోజుల శిక్షణ ప్రారంభించారు. మొదటి రోజు స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామీణ యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మొత్తం 30 మందికి శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్భంగా పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా. సుధారాణి, పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ సిరిధాన్యాల పోషక విలువలు, ఆరోగ్యకరమైన జీవనశైలిలో వాటి ప్రాముఖ్యతను వివరించారు. రోజువారీ ఆహారంలో సిరిధాన్యాలను చేర్చుకోవడం ద్వారా పోషకాహార భద్రతతో పాటు ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని అవగాహన కల్పించారు. అంతకుముందు సిరిధాన్యాలను శుభ్రపరచడం, గ్రేడింగ్, పొట్టు తొలగించడం వంటి ప్రక్రియలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించే విధానాలను వివరించారు.

నాణ్యమైన ఉత్పత్తుల తయారీ, నిల్వ సామర్థ్యం పెంపు, వినియోగదారుల ఆదరణ మరియు మార్కెట్ విలువను పెంచడంలో ప్రాథమిక ప్రాసెసింగ్ పాత్ర ఎంత ముఖ్యమో వివరించారు. మిల్లెట్ ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ శా ్రస్తవేత్త డా. ప్రదీప ఆధ్వర్యంలో వివిధ రకాల సిరిధాన్యాల బేకరీ ఉత్పత్తులను తయారు చేశారు. ఈ సందర్భంగా జొన్న బిస్కెట్లు, రాగి బిస్కెట్లు, బెల్లంతో జొన్న బిస్కెట్లు, బెల్లంతో రాగి బిస్కెట్లు, జీలకర్ర జొన్న ఉప్పు బిస్కెట్లు తయారు చేసే విధానాన్ని పరిశీలించారు.


