కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ లకు బ్రేక్..!
– రెండు పథకాలపై హైకోర్టు స్టే
– కారణం ఇదే..
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం 2014 నుంచి జారీ చేసిన జీవోలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సంబంధిత జీవోల అమలుపై మధ్యంతర స్టే విధించింది. పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు చెల్లింపులు చేయాలని కోరుతూ ప్రభుత్వం చర్యలు చేపట్టగా, పథకాల అమలు విధానంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.

ముఖ్యంగా 2014 నుంచి జారీ చేసిన పలు జీవోల ఆధారంగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్న తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సంబంధిత ఉత్తర్వుల అమలును నిలిపివేసింది.

దీంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులపై ఈ మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం పడే అవకాశం ఉంది. పథకాల అమలుపై తదుపరి విచారణలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం తరఫున తదుపరి చర్యలు, కోర్టు ఆదేశాల అనంతరం పరిస్థితి ఎలా ఉంటుందన్నది వేచి చూడాల్సి ఉంది.


