అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష..
– వచ్చే నెల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై దృష్టి
తాండూరు, దర్శిని ప్రతినిధి : నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

గురువారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ డీఈ శంకర్, ఏఈలు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వచ్చే నెలలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాండూరు నియోజకవర్గంలో పర్యటించే అవకాశం ఉన్న నేపథ్యంలో, పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు.

నియోజకవర్గ పరిధిలో ఇరిగేషన్ శాఖ చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే కాగ్నా నదిలోకి మురుగు నీరు కలవకుండా చర్యలు చేపట్టడంతో పాటు, నది పరిరక్షణకు అవసరమైన కార్యాచరణపై అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. నియోజకవర్గంలో అవసరమైన ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, వాటి నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటి ప్రస్తుత పురోగతిపై కూడా ఆరా తీశారు.

మంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని శాఖాపరమైన పనులు, ప్రతిపాదనలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచించారు.


