కొంపముంచిన మత్తు..!
– చోరికి వెళ్లి అదే ఇంట్లో నిద్రించిన దొంగ
– సోషల్ మీడియాలో వైరల్ అయిన సంఘటన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఓ దొంగ దొంగతనం చేయడానికి వచ్చి.. తిరిగి వెళ్లకుండా చేసిన పని అతడి కొంప ముంచింది. హైదరాబాద్లో ఆ దొంగ చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. పాత బస్తిలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ విచిత్ర ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

గంజాయి మత్తులో ఉన్న ఓ స్థానికుడు ఓ ఇంట్లోకి చొరబడి బంగారం, ఫోన్లు తీసుకున్నాడు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న అతడికి మత్తు కమ్మేసింది. ఇంకేముంది.. దొంగతనం చేసిన ఇంట్లోనే హాయిగా నిద్రపోయాడు. చోరీ చేసిన బెడ్ రూంలోనే నిద్రపోయాడు.

ఇంటికి తిరిగొచ్చిన కుటుంబ సభ్యులు బీరువా తెరిచి ఉండటాన్ని గమనించారు. ఇంట్లో పరిశీలించగా.. ఓ అపరిచితుడు ఏ మాత్రం బెరుకు లేకుండా నిద్రపోతూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అతడి వద్ద తమ బంగారు ఆభరణాలు ఉండటాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కుటుంబ సభ్యులు ఘటనను వీడియోగా రికార్డు చేయగా.. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. చోరీ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
వీడియో చూడండి..


