యాలాల మండలానికి తాగునీటి వరం

తాండూరు రాజకీయం వికారాబాద్

యాలాల మండలానికి తాగునీటి వరం
– ఎమ్మెల్యే చొరవతో 14 గ్రామాలకు ప్రయోజనం
– కాగ్నా నీటి పథకానికి రూ.110 కోట్ల నిధులు
– హర్షం వ్యక్తం చేసిన మండల అధ్యక్షులు మహిపాల్, నేతలు
యాలాల, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని కాంగ్రెస్‌ యాలాల్‌ మండల అధ్యక్షుడు కుర్వ మహిపాల్‌ అన్నారు.

తాండూరు పట్టణానికి కాగ్నా నది నుంచి తాగునీరు అందించేందుకు రూ.110 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే కీలకంగా వ్యవహరించారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో తాగునీటి ఇబ్బందులను దూరం చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.

నూతన పైప్‌లైన్‌ ద్వారా యాలాల్‌ మండలంలోని సుమారు 14 గ్రామాలకు తాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మహిపాల్‌ పేర్కొన్నారు. త్వరలో పనులు ప్రారంభమై గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగ్నా పరివాహక ప్రాంతంలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందేలా ఎమ్మెల్యే దృష్టికి ప్రజల సమస్యలను తీసుకెళ్లి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన ఓ రోడ్‌షోలో కొందరు యువకులు చేసిన వ్యాఖ్యలు, చిల్లర చేష్టలపై మహిపాల్‌ స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, అయితే వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తావులేకుండా ప్రజా సమస్యలు, అభివృద్ధిపై మాట్లాడాలని సూచించారు. తాండూరు ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారో గమనిస్తున్నారని, ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసే చర్యలను ప్రజలు సహించరని అన్నారు.

ఈ కార్యక్రమంలో బి-బ్లాక్‌ అధ్యక్షుడు అనిల్‌ భీంశెట్టి, సీనియర్‌ నాయకులు అమృతప్ప, పవన్‌కుమార్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు శంకరప్ప, రాజు, మల్లయ్య, నర్సింహులు, సత్యనారాయణరెడ్డి, మొగులయ్య, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏఎంసీ చైర్మన్‌కు ఘన సన్మానం