కార్మికులను రోడ్డెక్కించడం సిగ్గుచేటు

తాండూరు రాజకీయం వికారాబాద్

కార్మికులను రోడ్డెక్కించడం సిగ్గుచేటు
– న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి
– సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్‌ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం మున్సిపల్ కార్మికులను రోడ్డెక్కించే దుస్థితిని తీసుకరావడం సిగ్గుచేటని తాండూరు కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. పీఆర్సీ వేతనాలు చెల్లించాలని ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నమున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కావలి సంతోష్‌, నాయకులు నారా అశోక్, బాతుల వెంకటయ్య తదితరులు సమ్మెకు మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 11వ పీఆర్సీ కింద ప్రకటించిన వేతనాలు అన్ని మున్సిపాల్టీలలో అమలు చేస్తుంటే తాండూరులో కార్మికుల పట్ల వివక్ష చూపిస్తున్నారని అన్నారు. పగలు రాత్రి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడమే కాకుండా వారికి న్యాయంగా దక్కాల్సిన పీఆర్సీని అమలు చేయకపోవడం దారుణమన్నారు. అధికార పార్టీ పాలనలో ఉన్న కార్మికులు రోడ్డు ఎక్కడం సిగ్గుచేటన్నారు. కార్మికుల డిమాండ్లు నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఇప్పటికైనా కార్మికులకు పెంచిన పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఖయ్యూం, ఎన్ఎస్‌యూఐ జిల్లా నాయకులు అంకిత్ అనురాగ్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.