అర్హులకే ఓటు.. డబుల్‌ ఓట్లు ఔట్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అర్హులకే ఓటు.. డబుల్‌ ఓట్లు ఔట్..!
– ఆరో వార్డులో ఎస్‌ఐఆర్‌ వందశాతం దిశగా
– పక్కా ఆధారాలతో నోటీసుల పరిష్కారం
– ఓటర్లను అయోమయానికి గురిచేయొద్దు
– బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆర్మి అనిల్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ఇందిరానగర్‌ ఆరో వార్డులో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వందశాతం పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్‌ ఆర్మి అనిల్‌కుమార్‌ తెలిపారు.

శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని పేర్కొన్నారు. వార్డులో ఒకరికి రెండు ఓట్లు ఉండకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఒక్క ఓటు మాత్రమే ఉండేలా చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అనిల్‌కుమార్‌ తెలిపారు.

ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, నిబంధనల ప్రకారమే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. కావాలనే కొందరు ఓటర్లను అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఎవ్వరు కూడా తమ ఓటు తొలగించారని చెప్పుకోవడం లేదనే విషయాన్ని గమనించాలని సూచించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారి కుటుంబ వివరాలను గతంలో ఓటు హక్కు కలిగిన కుటుంబ సభ్యుల వివరాలతో సరిపోల్చాలనే నిబంధన ద్వంద్వ ఓట్లను గుర్తించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు.

సరైన ఆధారాలు అందుబాటులో లేని కారణంగా కొందరికి నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు. అయినా కూడా సంబంధిత వ్యక్తులు అవసరమైన పత్రాలను బూత్‌ స్థాయి అధికారుల(బీఎల్‌ఓ)కు అందజేస్తే నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని వివరించారు. పక్కా ఆధారాలతో నోటీసుల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదని, అధికార యంత్రాంగం పారదర్శకంగా వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. అర్హులైన ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైన ఆధారాలను సమర్పించి ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు.

భక్తి, సంప్రదాయాలకు ప్రతీక పెత్తర అమావాస్య