ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణే మా లక్ష్యం
– ఎస్‌ఐఆర్ అవకతవకలపై ఢిల్లీలో గళమెత్తుతాం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
– ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీకి పయనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ అధ్యక్షతన, రాష్ట్ర మంత్రులు, సహాచర ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల బృందంతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేపట్టిన ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరును నిరసిస్తూ ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్నట్లు తెలిపారు.

ఎస్‌ఐఆర్ అవకతవకలపై ఢిల్లీలో గళమెత్తుతామని అన్నారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.


