శాస్త్ర స్కూల్లో బతుకమ్మ శోభ..!
– ఉత్సహాంగా దసరా సంబరాలు
– ఆకట్టుకున్న విద్యార్థుల వేషాధారణలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్‌లోని శాస్త్ర స్కూల్లో బతుకమ్మ, దసరా పండుగ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో అలరించారు. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినులు, విద్యార్థులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని నృత్యాలతో ఆకట్టుకున్నారు.
అనంతరం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా వేడుకల్లో భాగంగా రావణ లంక దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రావణుడి ప్రతిమ దహనంతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా శ్రీరాముని విజయగాథను వివరిస్తూ సత్యం, ధర్మం గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు.

విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవభావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. వేడుకలను విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులను, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.


