శ్రీ కృష్ణవేణి టాలెంట్‌లో బతుకమ్మ సందడి..!
– బతుకమ్మ ఆట పాటల ఉర్రూతలు
– తెలంగాణ సంస్కృతిని చాటిన వేడుకలు
– అభినందించిన యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ సంస్కృతి సౌరభాన్ని చాటుతూ తాండూరులోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో బతుకమ్మ సంబరాలు సందడి పండగ వాతావరణాన్ని నెలకొల్పింది.

శుక్రవారం పాఠశాలలో రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు.. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థులు.. ఆటపాటలు, నృత్యాలతో పాఠశాల ప్రాంగణం సంప్రదాయ శోభను సంతరించుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మలను పేర్చి గౌరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

బతుకమ్మ ఆట పాటలతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగలో వివిధ రకాల పూలకు ప్రత్యేక స్థానం ఉందని, వాటి ప్రాముఖ్యతను విద్యార్థులు తెలుసుకోవడం అవసరమని అన్నారు. పాఠశాల కరస్పాండెంట్ పట్లోళ్ల సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకల ద్వారా విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించవచ్చని తెలిపారు.

పాఠశాల డైరెక్టర్ ద్యావరి జయవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ, బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పాఠశాల ప్రాంగణంలో నూతన ఉత్సాహాన్ని నింపాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎన్. రమేష్ గారు, సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ పి. చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీ ఎ. అనిల్ కుమార్ గారు, శ్రీమతి సునీత గారు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


