బకాయిలు చెల్లిస్తారా లేదా..?
– అద్దె వసూళ్ల కోసం దేవాదాయ శాఖ అధికారుల ఒత్తిడి
– హనుమాన్ చౌల్ట్రీ దుకాణా సముదాయాలపై దాడులు
– వందశాతం చెల్లింపుతో వెనుదిరగిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: అద్దె బకాయిలు చెల్లిస్తారా లేదా అంటూ దేవాదాయ శాఖ అధికారులు దాడులు చేపట్టారు. శుక్రవారం తాండూరు పట్టణం రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే స్టేషన్ హానుమాన్ చౌల్ట్రీ దుకాణాల వద్ద దేవాదాయ శాఖ అధికారులు హైడ్రామా చేశారు. ఇందుకు సంబందించిన వివరాలాలిలా ఉన్నాయి. స్టేషన్ హనుమాన్ దేవాలయ పరిధిలో రైల్వేస్టేషన్ రోడ్డు మార్గంలో హనుమాన్ చౌల్ట్రీ పేరుపై దుకాణాల సముదాయం ఉంది. ఆరు దుకాణాలు, పై అంతస్తులలో 15 గదులు ఉన్నాయి. అయితే సముదాయానికి సంబంధించి దాదాపు గత మూడు నెలల నుంచి అద్దె బకాయిలు ఏర్పడ్డాయి. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈఓల బృందం సభ్యులు తాండూరు ఏఓ నరేందర్ ఆధ్వర్యంలో దుకాణాలపై దాడులు నిర్వహించారు. అద్దె దారుల నుంచి బకాయిలు చెల్లించాలని ఒత్తిడి తీసుకరావడంతో ఉద్రిక్త వాతవరణం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐ గిరి పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుకాణ సముదాయాల అద్దె దారుల ప్రతినిధి, అధికారుల మద్య కొంత వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరకు పూర్తి అద్దె బకాయిలు చెల్లించేందుకు అంగీకారం జరడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం దాడులకు వచ్చిన దేవాదాయ శాఖ అధికారులు అద్దె దారుల నుంచి రూ. 7లక్షల 24 వేల బకాయిలను రికవరీ చేశారు.
రాజకీయ ఒత్తిళ్లే : అద్దెదారుడు, బిర్కట్ రఘు
————————————————
మరోవైపు దుకాణాల సముదాయాలపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అధికారులు దాడులు చేపట్టారని అద్దెదారుడు, టీఆర్ఎస్‌వై రాష్ట్ర నాయకుడు బిర్కడ్ రఘు ఆరోపించారు. బకాయిలు చెల్లించాలని ఒకే నోటీసు అందించారని, దీనికి బదులుగా రిజిస్టర్ పోస్టు ద్వారా వివరణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. దేవాదాయ శాఖ ట్రస్టు అనుమతితోనే దుకాణాలను నిర్మించడం జరిగిందని, డోనర్ పథకం కింద దుకాణాలను కట్టుకోవడం జరిగిందన్నారు. ఇది జీర్ణించుకోలేక కుట్ర పూరితంగా దాడులు చేయిస్తున్నారని అన్నారు. ఎన్ని ఒత్తిళ్లు చేసినా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. అధికారులకు పూర్తి బకాయిలు చెల్లించడం జరిగిందని తెలిపారు.