నిరుపేదల కలల సాకారమే సర్కారు ధ్యేయం..!
– ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటికి భరోసా
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– 9వ వార్డులో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుపేదల సొంతింటి కలలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు.

పట్టణంలోని 9వ వార్డులో నూతనంగా నిర్మించిన నీలమ్మ–లాలప్ప దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నది ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.

ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల ఆశలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సహకారంతో ఇళ్ల నిర్మాణం చేపట్టుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. సొంత ఇల్లు కలిగి ఉండటం ప్రతి కుటుంబానికి భద్రతతో పాటు ఆత్మగౌరవాన్ని ఇస్తుందని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. నీలమ్మ–లాలప్ప దంపతులు తమ నూతన గృహంలో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మనోహర్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు బంటు మల్లప్ప, ప్రభాకర్ గౌడ్, అధ్యక్షులు బాతుల నాగరాజు, మాజీ అధ్యక్షులు హబీబ్ లాల, కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.


