శ్రీశైలం భక్తులకు శుభవార్త
– 21నుంచి ఐదు రోజులు స్పర్శ దర్శనాలు
దర్శని డెస్క్ : శ్రీశైల మల్లన్న క్షేత్ర భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. ఈనెల 21వ తేది వరకు భక్తులకు సర్వ దర్శనాలు కల్పిస్తామని ఆలయ ఈఓ లవన్న తెలిపారు. 5 రోజుల పాటు స్పర్శ దర్శనాలు కొనసాగనున్నాయి. గతనెల కోవిడ్ కారణంగా దేవాలయంలోని గర్భాలయాల అభిషేకాలను నిలిపివేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో స్పర్శదర్శనానికి వీలు కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాదిరిగానే విరామ సమయంలోనూ భక్తులు స్పర్శదర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి 3 గంటల వరకు భక్తులకు ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 22వ తేది నుంచి వచ్చేనేల 4వ తేదీ వరకు సర్వ దర్శనాలు రద్దు చేస్తామని చెప్పారు. దీంతో పాటు అభిషేకాలు, వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లను ఇవాళ్టి నుంచే భక్తులకు అందుబాటులో ఉంచుతామని ఆలయం ఈవో లవన్న పేర్కొన్నారు.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 1న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రుద్రాభిషేకం, లింగోద్భవం, రాత్రి పాగాలంకరణ, కల్యాణోత్సవం, 2న రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు.

