సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల సేవలు కీలకం..!
– ఇండ్ల స్థలాలపై త్వరలోనే శుభవార్త
– పూర్తిస్థాయి హెల్త్ కార్డుల అమలుకు చర్యలు
– వికారాబాద్‌లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తాం
– తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
– ఐజేయూ జర్నలిస్టు యూనియన్ డైరీ ఆవిష్కరణ
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల సేవలు కీలమని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్‌లోని జెడ్పీ కాన్ఫరెన్స్ కార్యాలయంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జర్నలిస్టు యూనియన్ వికారాబాద్ జిల్లా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సబితారెడ్డి హాజరై వికాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డా. మెతుకు ఆనంద్ , కాలే యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస చారి, ప్రధాన కార్యదర్శి శ్రీదర్లతో కలిసి డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ సమాజ అభివృద్ధి లో జర్నలిస్టుల భాగస్వామ్యం మరువలేనిదన్నారు. వారి సేవలు చాలా కీలకంగా నిలుస్తాయన్నారు. జర్నలిస్టులు వెలికితీసే వార్త కథనాలకు స్పందిస్తాం. ఇటీవలి పెద్దేముల్ మండలంలో జరిగిన ఓ సంఘటనకు స్పందించి, అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగిందని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు ప్రజా సంక్షేమం కోసమే పని చేస్తారని.. మా దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా అర్హులైన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి త్వరలో ముఖ్యమంత్రి గారి ద్వారా శుభవార్త వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో పాటు హెల్త్ కార్డ్స్ పూర్తి స్థాయిలో పని చేసేలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించి, జిల్లా నలువైపులా నుండి జిల్లా కేంద్రానికి వచ్చే జర్నలిస్టులకు అందుబాటులకు తీసుకవస్తామన్నారు. కరోనా తో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం రెండు లక్షల సహాయం అందించిందని, దీంతో పాటు కరోనా బారిన పడ్డ వారికి కూడా ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సీనీయర్ జర్నలిస్టులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

