భూకైలాస్‌లో గుల్బర్గా ఎంపీ ఉమేష్ జాదవ్ పూజలు
– అంతాంరం తాండాలో ముగిసిన మహ శివరాత్రి ఉత్సవాలు
– అగ్ని గుండ ప్రవేశం, పల్లకిసేవ ఊరేగింపులు, అన్నదానాలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలం అంతారం తాండాలో వెలసిన భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానాన్ని కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా ఎంపీ ఉమేష్ జాదవ్ మంగళవారం రాత్రి సందర్శించారు. మహా శివరాత్రి సందర్భంగా ఆలయంలో మహా శివున్ని దర్శించుకుని శివలింగాలనికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు శంకర్ నాయక్ పవార్, వాసు నాయక్ పవార్‌లతో కలిసి పలు పూజా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. అనంతరం ఎంపీ ఉమేష్ జాదవ్‌ను శంకర్ నాయక్, వాసు నాయక్‌లు ఘనంగా సన్మానించారు. మరోవైపు అంతాంరం తాండాలోని భూకైలాస్‌లో కొనసాగుతున్న మహా శివరాత్రి ఉత్సవాలు బుధవారం ముగిశాయి.
అంతకుముందు మంగళవారం తెల్లవారు జామున ఆలయంలో అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ అగ్నిగుండంలో వాసు నాయక్, పలువురు ప్రవేశం చేసి మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను కొనసాగించారు. ఆలయంలో పల్లకిసేవ ఊరేగింపు కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.


