బల్దియాలో బడ్జెట్ రగడ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బల్దియాలో బడ్జెట్ రగడ..!
– వాయిదా వేయడంపై ప్రతిపక్ష కౌన్సిలర్ల నిరసన
– మున్సిపల్ కార్యాలయం దిగ్భందం
– సర్దిచెప్పిన పట్టణ పోలీసులు
– చివరకు హైడ్రామాగా మారిన నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ కార్యాలయంలో రెండో సారి ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశంపై రగడ చోటు చేసుకుంది. సమావేశాన్ని వాయిదా వేయ‌డంతో కార్యాలయానికి చేరుకున్న ప్రతిపక్ష కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. చైర్ పర్సన్ బడ్జెట్ సమావేశంపై కోర్టులో స్టే తీసుకరావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కథనంలోకి వెళితే… మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో రెండోసారి బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే గత నెల 25న మున్సిసల్లో తొలిసారి బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోరం లేక వాయిదా వేయడం జరిగిందని, కలెక్టర్ ఆదేశాల మేరకు తాజాగా మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంపై మున్సిపల్ చైర్ పర్సన్ కోర్టు నుంచి స్టే తీసుకరావడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అప్పటికే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీఎస్ఎస్, సీపీఐ కౌన్సిరల్లు విషయం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారాన్ని నిరసిస్తూ టీజేఎస్ ఫ్లోర్ లీడర్ సోమ శేఖర్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్‌, సీపీఐ ఫ్లోర్ లీడర్ ఆసిఫ్ లు మున్సిపల్ ముఖ ద్వారా వద్ద నిరసనకు దిగారు. చైర్ పర్సన్‌, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ బడ్జెట్ సమావేశంపై స్టే తీసుకరావడం పట్ల మండిపడ్డారు. మున్సిపల్లో సమావేశాలు జరగకుండా చైర్ పర్సన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. స్టే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ నిరసనకు బీజేపీ కౌన్సిలర్లు అంతారం లలిత, బంటారం లావణ్య, బాలప్పులు మద్దతు తెలిపి అభివృద్ధికి అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.

కార్యాలయం తలుపులు మూసి.. హైడ్రామాగా ముగించి

అనంతరం ప్రతిపక్ష కౌన్సిలర్లు సోమశేఖర్, వరాల శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, ఆసిఫ్ లు మున్సిపల్ కార్యాలయం తలుపులను మూసి వేశారు.
దీంతో అధికారులు, అప్పటికే లోపలికి వెళ్లిన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కౌన్సిలర్లు అస్లాం, ఎర్రం వసంత, బొంబీనా, కోఆప్షన్ సభ్యులు సారంగా విజయ్, వెంకట్రామ్ నాయక్ లు దిగ్భందం అయ్యారు. దాదాపు అరగంటకు పైగా కౌన్సిలర్లు కార్యాలయాన్ని దిగ్బంధించారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని ఎస్ఐలు అరవింద్, అబ్దుల్ రవూఫ్ లు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కౌన్సిలర్లు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు పోలీసులు కార్యాలయం తలుపులు తెరవడంతో ఓ పెద్ద హైడ్రామా తరహాలో కౌన్సిలర్లు నిరసన విరమించుకున్నారు.