ఉలిక్కి పడ్డ గుట్కా మాఫీయా..!
– తాండూరులో ముమ్మర తనిఖీలు
– రట్టు అయిన గోదాంలలో నిల్వల గుట్టు
– లక్షల విలువైన ప్యాకెట్ల స్వాదీనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరులో గుట్కా మాఫీయా ఉలిక్కి పడింది. జిల్లా టాస్క్ ఫోర్స్, పోలీసుల సంయుక్త దాడులలో గోదాంలలో గుట్కా ప్యాకెట్ల నిల్వల గుట్టు రట్టయ్యింది. ముమ్మర దాడులతో లక్షల విలువైన ప్యాకెట్లను అధికారు స్వాదీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యాపారులపై తాండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
వికారాబాద్ జిల్లా ఎస్పీ కె.నారాయణరెడ్డి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, తాండూరు పోలీసులు పట్టణంలోని గుట్కా స్థావరాలపై దాడులు నిర్వహించారు. పట్టణంలోని మల్లప్ప మడిగ వద్ద ఠాకూర్ అజయ్ సింగ్ అనే వ్యాపారికి చెందిన గోదాంలో గుట్కా ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1లక్ష 50 వేల 890లు ఉంటుందని అధికారులు తెలిపారు.
అదేవిధంగా పట్టణంలోని అదే ప్రాంతంలో గాంధీచౌక్‌కు చెందిన కౌకుంట్ల నందు అనే వ్యాపారి వద్ద, వాసవీ కాలనీకి చెందిన గుముడాల శ్రీనివాస్ అనే వ్యాపారి వద్ద నుంచి కూడా నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5లక్షల 99వేల 175లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనల్లో ముగ్గురు వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గురువారం ఒక్కరోజే టాస్క్ ఫోర్స్, పోలీసుల తనిఖీలు తాండూరు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు గుట్టుగా గుట్కా విక్రయాలకు చేపడుతున్న వ్యాపారులు అప్రమత్తం అయ్యారని తెలుస్తోంది.
ఇదికూడా చదవండి…

