భద్రేశ్వరుడి వైభోగానికి వేళాయే..!
– నేటి నుంచి జాతర మహోత్సవాలు షురూ
– రెండేళ్ల తరువాతర జాతరకు ఏర్పాట్లు
– 23న రథోత్సవం, 24న లంకాదహన వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ పొందిన శ్రీ భావిగి భద్రేశ్వర జాతర మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ జాతర మహోత్సవాలకు ఆలయ రెనోవేషన్ కమిటీ, ఆలయ ఈఓల ఆధ్వర్యంలో ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. కరోనా మహామ్మారి వల్ల రెండేళ్ల తరువాత ప్రారంభమయ్యే జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 24వ తేది వరకు జరుగుతాయి. తాండూరులో కొలువైన భద్రేశ్వరుడికి ప్రతిఏటా జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీరామ నవమి తర్వాత దవణ పౌర్ణమి అనంతరం ఈ జాతర ఉత్సవాలను నిర్వహిస్తారు. తాండూరుతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి అత్యధిక భక్తులు జాతరకు వస్తారు.
ఆరు రోజుల పాటు పల్లకి సేవ, నిత్య అన్నదానం
భద్రేశ్వరుడి జాతర ఉత్సవాల్లో భాగంగా ఆరు రోజుల పాటు పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జాతర ఉత్సవాల ప్రారంభ సూచికంగా భద్రేశ్వరుడి పల్లకి సేవను నిర్వహిస్తున్నారు. ఆలయం నుంచి ప్రతిరోజు ఎంపిక చేసుకున్న మార్గాలలో సల్లకి సేవ ఉంటుంది. ఈనెల 24వ తేదీ వరకు వరుసగా ప్రతిరోజు.. పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆలయంలో ఈ ఆరు రోజుల పాటు భక్తులకు నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు.
23న రథోత్సవం – 24న లంకాదహనం.
జాతర ఉత్సవాల్లో ప్రత్యేక ఘట్టమైన భద్రేశ్వరుడి రథోత్సవంను ఈనెల 23న నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ రథనిర్మాణ పనులను ప్రారంభించారు. దాదాపు 50 అడుగుల ఎత్తయిన రథనిర్మాణ పనులను చేపట్టాడు. రంగురంగుల కాగితాలు, అలంకరణ సామాగ్రితో రథనిర్మాణం చేస్తున్నారు. ఈనెల 23న రాత్రి 11-05 గంటల ప్రాంతంలో రథా త్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రథోత్సవంకు ముందు రథం ముందు భాగంలో రంగవల్లి, కుంభం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహిస్తారు. రథోత్సవం మరుసటి రోజు 24వ తేదిన లంకాదహనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆరోజు రాత్రి భద్రేశ్వరుడిని పల్లకిలో ఊరేగించిన అనంతరమే లంకాదహనంను నిర్వహిస్తారు. ఈనెల 27న రథం పైభాగంలో ఏర్పాటు చేసిన కలశంను కిందకు దించి జాతర ఉత్సవాలను ముగిస్తారు.
పశు ప్రదర్శన శిశు ప్రదర్శన
అదేవిధంగా జాతర ఉత్సవాలలో పశుప్రదర్శనకు సైతం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. 24వ తేది ఆదివారం తాండూరు పట్టణం ముర్షద్ దర్గా సమీపంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఈ పదర్శనను నిర్వహిస్తున్నారు.

