రోడ్డు బాలేదు.. అంబులెన్స్ రాదు
– గర్భిణీ పట్ల సిబ్బంది నిర్లక్ష్యం
– ఆసుపత్రి ఎంట్రెన్స్ వద్దే డెలివరీ
– తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: గ్రామానికి రోడ్డు బాలేదు.. అంబులెన్స్ రాదు అంటూ నిండు గర్భిణి పట్ల సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించారు. చివరకు కుటుంభీకులు గర్భిణీని ఆటోలో ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆసుపత్రి ఎంట్రెన్స్ వద్దే ఆమె ప్రసవించింది. ఈ విధారకర సంఘటన సోమవారం తాండూరు పట్టణం మాతా శిశు ఆసుపత్రి వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… తాండూరు మండలం ఉద్దండాపూర్ మైసమ్మ తండాకు చెందిన రమేష్ భార్య పూజకు రెండోసారి గర్భం దాల్చింది. సోమవారం ఉదయం పురుటినొప్పులు రావడంతో అంబులెన్స్ కు సమాచారం అందించారు. తాండాకు రోడ్డు సౌకర్యం లేదని అంబులెన్స్ రాదని సిబ్బంది చెప్పినట్లు కుటుంభీకులు తెలిపారు. నొప్పులు అధికం కావడంతో ఆమెను ఆటోలో తాండూరులోని ఎంపీ హెచ్ ఆసుపత్రికి తరలించామని చెప్పుకొచ్చారు. ఆసుపత్రి ఎంట్రెన్స్ వద్దకు రాగానే పూజా పరిస్థితి చేయిదాటింది. పురుటి నొప్పులు అధికం కావడంతో అక్కడే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి వైద్యులు స్పందించి అక్కడే ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం తల్లీ, బిడ్డను ఆసుపత్రిలోని ప్రసూతి వార్డుకు తరలించారు. ప్రస్తుతం పూజతో పాటు ఆమె జన్మనిచ్చిన శిశువు క్షేమంగా ఉన్నారు. దీంతో కుటుంభీకులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు గర్భిణి పట్ల అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించడంపై కుటుంభీకులు అసహనం వ్యక్తం చేశారు.

