దొంగ బాబపై కేసు
– హిష్టరీ షీట్ కూడ నమోదు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి
– మూఢనమ్మకాలను నమ్మొద్దంటూ సూచన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: దెయ్యం వదిలిస్తానని మంటల్లో యువతికి గాయాలు చేసిన దొంగబాబపై వికారాబాద్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఈ విషయాన్నివెల్లడించారు. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో కుక్కింద గ్రామానికి చెందిన వెంకటయ్య కూతురుకు గాలి సోకిందని ఈనెల 13న పరిగి మండలం నస్కల్లో రఫీక్ అనే ఓ దొంగ బాబకు వద్దకు తీసుకెళ్లగా వచ్చిరాని మర్మాలతో యువతిని మంటల్లో నడిపించాడు. దీంతో యువతి కాళ్లకు, చేతికి కాలిన గాయాలయ్యాయి. గురువారం రాత్రి యువతిని ఆసుపత్రిలో చేర్పించడంతో సంఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఆరా తీశారు. బాధితురాలి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు దొంగబాబ రఫీక్పై కేసు నమోదు చేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా అతనిపై హిస్టరీ షీట్ ఓపెన్ చేసినట్లు ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేటి సమాజంలో మూఢనమ్మకాలను విశ్వసించరాదని సూచించారు. ఇలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే 100తో పాటు సఖి, భరోసా కేంద్రాలలో సంప్రదించాలన్నారు. ఎవరైన దొంగబాబలు, బురిడీ బాబలు ఉంటే 100కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు.

