ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరచాలి
– పెరిగిన నిత్యవసర ధరలను తగ్గించాలి
– తహసీల్దార్ కు సీపీఎం నాయకుల వినతి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరిచి పెంచిన నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరచాలన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలందరికి 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వాలు పెంచిన నిత్యవసర ధరల వల్ల పేదలు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ధరలను తగ్గించాలన్నారు. దీంతో పాటు ఉపాధి పథకంలో కూలీలకు భద్రత కల్పించి.. పథకాన్ని పట్టణాలకు విస్తరించాలన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించడంతో పాటు ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, యు.బుగ్గప్ప, ఉప్పలి మల్కయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కింది వరకు చూడండి…



