సర్కారుకు సర్పంచుల సెగ..!
– పల్లె ప్రగతి విడియో కాన్ఫరెన్స్ బహిష్కరణ
– కార్యాలయాల ముందు సర్పంచుల నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సర్కారుకు తాండూరు నియోజకవర్గంలోని సర్పంచులు సెగ చూపించారు. ఈనెల 3 నుంచి చేపడుతున్న పల్లె ప్రగతిని దృష్టిలో ఉంచుకుని బుధవారం ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాలను బహిష్కరించారు. అనంతరం మండల కేంద్రాలలోని ఎంపీడీఓ కార్యాలయాల ముందు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాల సర్పంచులు పార్టీలకతీతంగా నిరసనలో పాల్గొన్నారు. అధికార పార్టీకి చెందిన సర్పంచులు కూడ నిరసన వ్యక్తం చేశారు.
పెద్దేముల్ మండలంలో సర్పంచ్ ద్వావరి విజయమ్మ, రేగోండి సర్పంచ్ హైదర్, మంబాపూర్ సర్పంచ్ శ్రావాణ్ కుమార్, రుక్మాపూర్ సర్పంచ్ శివ లీల, కొండాపూర్ సర్పంచ్ చంద్రప్ప, దుగ్గపూర్ సర్పంచ్ పాషా తదితరలు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా పంచాయతీలలో సర్పంచులు చేపట్టిన పనులను ప్రభుత్వం బిల్లలు చెల్లించడం లేదన్నారు. దీంతో అప్పులు తెచ్చిన సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే సర్పంచులకు బిల్లులు చెల్లించి భరోసా కల్పించాలన్నారు. సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సర్పంచులు లేకుండానే…
మరోవైపు తాండూరు మండలంలో సర్పంచులు పల్లె ప్రగతి విడియో కాన్ఫరెన్స్‌ను బహిష్కరించడంతో వారు లేకుండానే సమావేశాన్ని నిర్వహించారు. తాండూరు ఎంపీపీ అనితా రవీందర్ గౌడ్, జెడ్పీటీసీ గౌడి మంజుల, వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామ్ రెడ్డి, ఎంపీటీసీలతో అధికారులు సమావేశం నిర్వహించారు.


