స్వార్థ పరులే టీఆర్ఎస్‌లో చేరారు
– ఒకరిద్దరు వెళ్లినా పార్టీకి నష్టం లేదు
– నిజాయితి ఉంటే పదవికి రాజీనామా చేసి గెలవాలి
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వార్థం కోసమే బీజేపీ కౌన్సిలర్లు టీఆర్ఎస్‌లో చేరడం జరిగిందని బీజేపీ నాయకులు అన్నారు. బీజేపీకి చెందిన ఫ్లోర్ లీడర్ సిందూజ గౌడ్, 20వ వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్లు టీఆర్ఎస్‌లో చేరడంపై ఆ పార్టీ నాయకులు స్పందించారు. శుక్రవారం బీజేపీ పట్టణ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచి బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న సింధూజ గౌడ్, సంగీత ఠాకూర్లు టీఆర్ఎస్‌కు అనుకూలంగా పనిచేశారని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని విమర్శించారు. వారిద్దరు తమ వ్యక్తిగత వ్యవహారాలు, స్వార్థం కోసమే ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే టీఆర్ఎస్‌లో చేరారని అన్నారు. బీజేపీ పార్టీ గుర్తుపై ప్రజల ఓట్లతో గెలిచామనే నిజాయితి ఉంటే వారు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని, దమ్ముంటే ప్రజాక్షేత్రంలో మరోసారి నిలిచి గెలిచి చూపించాలని డిమాండ్ చేశారు. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళితే పార్టీకి ఏమాత్రం నష్టం జరిగదని ధీమా వ్యక్తం చేశారు. మిగతా ఐదు మంది కౌన్సిలర్లు పార్టీ కోసమే పనిచేస్తారని, వాళ్లు పార్టీని వీడే ప్రసక్తేలేదని అన్నారు. మిగతా కౌన్సిలర్లలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు కుతంత్రాలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. మరోవైపు కౌన్సిలర్ బాలప్ప, సాహు శ్రీలతలు పార్టీని వీడుతున్నట్లు వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, సీనియర్ నాయకులు పూజారి పాండు, కౌన్సిలర్లు అంతారం లలిత, బంటారం లావణ్య, యాలాల మండల ఇంచార్జ్ రజనీకాంత్, యువమోర్చ నాయకులు అంతారం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



