విపత్కరంలో… అప్రమత్తం..!
– పోలీసు శాఖలో 24 గంటల అలర్ట్
– జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : భారీ వర్షాల విపత్కర పరిస్థితుల నేపథ్యంలో అంతా అప్రమత్తం చేసినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. ఎడతెరపి వర్షాలలో ఏమైనా ఇబ్బందులు ఎదరైతే అప్పటికప్పుడు స్పందించేలా అప్రమత్త చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్‌పి గారు మాట్లాడుతూ వాగులు వంకలు కల్వర్టులు పొంగిపొర్లుతున్నందున ప్రజలెవరూ నీటి ప్రవాహాలను దాటడానికి వీలులేకుండా ముందస్తుగా రోడ్డుకు రెండు వైపులా మరియు స్టాపర్ కోన్స్ ఏర్పాటు చేసి పోలీస్ అధికారులు సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేయాలని తెలిపారు. అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ వారి పరిధిలో ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని ప్రాజెక్ట్ లను, చెరువులను ప్రజలు సందర్శించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, ప్రాజెక్ట్ ల పరిసర ప్రాంతాలకు ప్రజలను అనుమతి ఇవ్వవద్దని తెలిపారు. బ్రిడ్జీలు చెరువులు కల్వర్టులపై నుండి వర్షం నీరు పొంగి పొర్లుతున్నందున ప్రమాదాలు జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ అధికారులు అందరూ ప్రతి గ్రామ సర్పంచ్,సంబంధిత గ్రామ ప్రజలతో సమన్వయంగా వుండి ఎప్పటికప్పుడు వరద ఉధృతి గురించి సమాచారం తెలుసుకోవాలి. 24X7 పోలీస్ అధికారులు సిబ్బంది విధినిర్వహణలో అప్రమత్తంగా ఉండి ప్రజల ప్రాణాలు కాపాడాలని సూచించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా గ్రామాలకు వెళ్ళే రోడ్లు గాని, రహదారులు గాని, పొలాలకి వెళ్ళే బాటలు కొట్టుకోనిపోయే అవకాశం ఉంది, కావునా ఎక్కడైనా రోడ్లు, వంతెనలు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినా పోలీస్ అధికారులకు తెలపాలన్నారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లు అయితే ప్రజలు తమ పరిధి లోని పోలీస్ స్టేషన్ అధికారులకు గాని, డైల్ 100 కు గాని ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుతూ, జిల్లా ప్రజల సంక్షేమం లో కూడా పోలీస్ అధికారులు ఎల్లపుడూ ముందు వరసలో ఉంటారని అన్నారు.



