మ‌ళ్లీ.. హైనా క‌ల‌క‌లం..!

క్రైం తాండూరు వికారాబాద్

మ‌ళ్లీ.. హైనా క‌ల‌క‌లం..!
– యాలాల‌లో సంచ‌రిస్తున్న అడ‌వి జంతువు
– ల‌క్ష్మీనారాయ‌ణ‌పూర్‌లో తోట‌, ఫాంహౌస్‌ల‌లో సంచారం
– అడ‌గుల‌ను గుర్తించిన అట‌విశాఖ అధికారులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ళ్లీ హైనా(అడ‌వి జంతువు) సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. గ‌తంతో తాండూరు మండ‌లంలో సంచ‌రించిన హైనా తాజాగా యాలాల‌ మండ‌లంలోని ల‌క్ష్మీనారాణ‌పూర్ గ్రామాల ప‌రిధిలోని పంట పొలాల‌లో సంచ‌రిస్తున్న‌ట్లు ఆందోళ‌న క‌లిగిస్తోంది. హైనా సంచారంతో స్థానికులు భ‌యాందోళ‌న‌కు గురవుతున్నారు. గ‌త కొన్ని రోజులుగా రాత్రి వేళ‌లో అడ‌వి జంతువు సంచ‌రిస్తున్న‌ట్లు అనుమానిస్తూ వ‌చ్చారు. ల‌క్ష్మీనారాణపూర్ ప‌రిధిలో తాండూరుకు చెందిన ర‌వీంద‌ర్ తోట‌తో పాటు డా.సీహెచ్ రామ‌న్న‌కు చెందిన ఫౌంహౌస్‌లోని మామిడి, జామ తోట‌ల‌లో తిరుగుతున్న‌ట్లు గుర్తించారు. విష‌యాన్ని తాండూరు అట‌వీశాఖ అధికారుల‌కు తెల‌పడంతో స‌మాచారం అందుకున్న తాండూరు ఫారెస్టు రేంజ్ ఆఫీస‌ర్ శ్యామ్ సుంద‌ర్ రావు పొలాలు, ఫాంహౌస్‌ల‌ను సంద‌ర్శించారు. ఆయా స్థ‌లాల‌లో అడ‌వి జంతువు అడుగుల‌ను గుర్తించారు. ఈ అడుగుల‌ను హైనా జంతువుకు సంబంధించిన అడుగులని నిర్దారించారు.

పులికాదు హైనానే : శ్యాం సుంద‌ర్ రావు

అయితే సంఘ‌ట‌నా స్థ‌లాన్ని సంద‌ర్శించిన అట‌విశాఖ అధికారి శ్యాంసుంద‌ర్ రావు మాట్లాడుతూ మొద‌ట్లో పులి సంచ‌రిస్తున్న‌ట్లు స్థానికులు అనుమానించ‌డం జ‌రిగింద‌న్నారు. సంఘ‌ట‌న స్థ‌లాంలో అడుగుల‌ను గుర్తించగా హైనాకు సంబంధించిన అడుగులుగా గుర్తించ‌డం జ‌రిగింద‌న్నారు. రాత్రి వేళ‌ల్లో రైతులు ఒంట‌రిగా సంచ‌రించరాద‌ని సూచించారు. అడ‌వి జంతువు సమాచారం తెలిస్తే అట‌విశాఖ అధికారుల‌ను సంప్ర‌దించాల‌న్నారు. హైనాను ప‌ట్టుకునేందుకు ప్ర‌త్యేక బోను ఏర్పాటు చేస్తామ‌న్నారు.

గ‌తంలో తాండూరు మండ‌లంలో
గ‌తంలో తాండూరు మండ‌లం, పెద్దేముల్ మండ‌లాల్లో కూడ అడ‌వి జంతువుల సంచార సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఈ యేడాది ఫిబ్ర‌వ‌రి మాసంలో తాండూరు మండ‌లం గోనూర్ గ్రామంలో హైనా సంచారం గుబులు రేపింది. విష‌యం తెలుసుకున్న అట‌విశాఖ అధికారులు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టి రెండు రోజుల్లోనే హైనాను ప‌ట్టుకుని జూకు త‌ర‌లించారు. ఆ మ‌రుస‌టి నెల‌లో పెద్దేముల్ మండ‌లంలో కూడ చిరుత సంచారం చేసిన‌ట్లు సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దానిని ప‌ట్టుకునేందుకు ప్ర‌త్యేక బోను, ఓ కుక్క‌ను కూడ ఏర్పాటు చేశారు. అప్ప‌ట్లో చిరుత ఆచూకీ ల‌భించ‌లేదు.