కుర్చీ కోసం కులం చిచ్చు త‌గ‌దు

తాండూరు రాజకీయం వికారాబాద్

కుర్చీ కోసం కులం చిచ్చు త‌గ‌దు
– అవ‌స‌ర‌మైతే రత్న‌మాల‌ను చైర్ ప‌ర్స‌న్ చెద్దాం
– మ‌హేంద‌ర్ రెడ్డిపై బుర‌ద‌జ‌ల్లితే ఖ‌డ‌బ్దార్
– ఎమ్మెల్సీ బీసీల‌కు వ్య‌తిరేకం కాదు
– ఎమ్మెల్సీ వ‌ర్గం బీసీ నేత‌ల కౌంట‌ర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : మున్సిపల్ చైర్ పర్సన్ కుర్చీ విషయంలో కులం చిచ్చు తీసుక‌రావ‌డం త‌గ‌ద‌ని, అవ‌స‌ర‌ర‌మైతే బీసీ వ‌ర్గానికి చెందిన‌ మ‌రో మ‌హిళ‌కు అవ‌కాశం క‌ల్పించేందుకు సిద్ద‌మ‌వుదామంటూ తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వర్గం బీసీ నేతలు పేర్కొన్నారు. మున్సిపల్ పదవి ఒప్పందంలో ఎమ్మెల్యే వర్గీయులు బీసీ కుల రాజకీయాలను తెరమీదకు తీసుకరావడాన్ని శ‌నివారం ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఎమ్మెల్సీ వర్గం బీసీ నేతలు ఖండించారు. తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్ హాల్లో సమావేశం ఏర్పాటు చేచేసిన స‌మావేశంలో డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, యాలాల మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అగ్గనూర్ జగదీశ్వర్, సీనియర్ నాయకులు పట్లోళ్ల బాల్ రెడ్డి, అజయ్ ప్రసాద్, రవీందర్, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, సీనియర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు అనురాధ తదితరులు మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ పదవి విషయంలో బీసీ కులాల మ‌ద్య చిచ్చురేపుతున్నార‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు బీసీ నినాదం చేస్తున్న నాయ‌కులు గ‌తంలో ఎమ్మెల్యే విష‌యంలో, చైర్ ప‌ర్స‌న్ విషయంలో, జెడ్పీటీసీల విష‌యాలో ద్రోహం చేసిన వాళ్లే అని ఆరోపించారు. వాళ్లు ఆశించిన విష‌యానికి వ‌స్తే దీపా న‌ర్సింలుకు కాకుండా మున్సిప‌ల్ మాజీ వైస్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల ర‌త్న‌మాల‌ను చైర్ పర్సన్ కుర్చీ విషయంలో సీఎం కేసీఆర్, పార్టీ అధిష్టానం, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు చూసుకుంటారని అన్నారు. కుర్చీ మార్పులో అధిష్టానందే తుది నిర్ణయమన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి ఎప్పుడు బీసీల‌కు వ్య‌తిరేకం కాద‌న్నారు. ఆయ‌న హాయాంలో బీసీలకు పెద్ద పీట వేస్తూ ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, పీఏసీఎస్ చైర్మన్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, కౌన్సిలర్లుగా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. స్వార్థం కోసం ఎమ్మెల్సీని వీడీ ఎమ్మెల్యే వెంట ఉన్న నాయకులు ఈ విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ప్రస్తుతం ఆయనపై కుల రాజకీయాలను రుద్ది బురదజల్లే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. మహేందర్ రెడ్డి జోలికొస్తే ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు.

రెచ్చ‌గొడితే కుర్చీ దిగేదే లేదు
మ‌రోవైపు రెండున్న‌ర గంట‌ల పాటు సాగిన స‌మావేశంలో బీసీ నేత‌లంతా ముక్త‌కంఠంతో చైర్ ప‌ర్స‌న్‌కు మ‌ద్ద‌తు తెలిపారు. చైర్ ప‌ర్స‌న్‌గా స్వ‌ప్న ప‌రిమ‌ళ్ ప‌ద‌వి చేప‌ట్టిన మొద‌ట్లోనే క‌రోనా మ‌హ‌మ్మారితో ఏడాది కాలం వృధా అయ్యింద‌న్నారు. అప్ప‌టి నుంచి ఎమ్మెల్యే వ‌ర్గీయులు అడ్డంకులు సృష్టించార‌ని ఆరోపించారు. ఓ పెద్ద నేత చైర్ ప‌ర్స‌న్‌ను బొమ్మ‌గా అభివ‌ర్ణించడం ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఎమ్మెల్యేతో పాటు నేత‌లు కాక‌మ్మ క‌థ‌లు చెబుతూ ద‌ద్ద‌మ్మ‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఘాటుగా విమ‌ర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు భరత్ భూషణ్, బంటుమల్లప్ప, బోయరాజు, ఇందూరు ప్రకాష్, జినుగుర్తి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు బోయరవి, రాము, వెంకన్న గౌడ్, కోఆప్షన్ సభ్యురాలు బిర్కడ్ ఉశ, ఎంపీటీసీలు రవిశిందే, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు గౌడి విష్ణు, అవుటి శంకర్, బెన్నూర్ శరణు, అగ్గనూర్ సర్పంచ్ భీమప్ప, చెంగోల్ రాము, శ్రీశైలం గౌడ్, రాజుగౌడ్, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. .