కాళికా అమ్మా బైలెల్లినాదో..!
– ముగిసిన జాతర ఉత్సవాలు
– శోభాయమానంగా తల్లి ఉత్సవ ఊరేగింపు
– అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ
– ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని పురవీధుల్లో కాళికాదేవి అమ్మవారి ఊరేగింపు శోభాయమానంగా కొనసాగింది. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు రెండో రోజు సోమవారం ముగిశాయి. జాతర ముగింపు సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తో కలిసి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, కౌన్సిలర్లు రవి, వెంకన్న గౌడ్, యువ నాయకులు బిర్కడ్ రఘు, దత్తులు ఉన్నారు.

మరోవవైపు ఉత్సవాలలో భాగంగా సాయంత్రం అమ్మవారి ఉత్సవ ఊరేగింపు నిర్వ హించారు. ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు పుర ప్రధాన వీధుల గుండ కొనసాగింది. ఊరేగింపులో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఊరేగింపులో అమ్మవారి విగ్రహంతో పాటు ప్రత్యేకంగా ఊరేగించిన అమ్మవారి ప్రతిమ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఊరేగింపు ముందు పోతురాజుల విన్యాసాలు, కళాకారుల డప్పు ప్రదర్శనలు కనువిందు చేశాయి.

అమ్మవారి జాతర ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఉత్సవ ఊరేగింపులో టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, నరేందర్ గౌడ్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఆలయ ఈఓ నరేందర్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ, కుల సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనగా.. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


