మార్వాడి యువమంచ్ మంచి మనసు
– 369 మందికి నోటుపుస్తకాలు, పలకల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టే మార్వాడి యువమంచ్ తాండూరు శాఖ సభ్యులు మరోసారి మంచి మనసును చాటుకున్నారు. నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని గ్రామీణ ప్రాంతా విద్యార్థులకు నోటు పుస్తకాలు, పలకలు,ఇతర వస్తువులు అందించి సంతోష పరిచారు. బుధవారం మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో మండలంలోని భోజ్యానాయక్ తాండా, బాబునాయక్ తాండా, హంక్యానాయక్ తాండా, జలాల్ పూర్, నీళ్లపల్లి, ఇస్మాయిల్ పూర్ పాఠశాలలో చదువుతున్న 369 మంది విద్యార్థులకు 1500ల నోటు పుస్తకాలు, 200 పలకలు, పెన్నులు, బలపాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సారడా మాట్లాడుతూ గత 30 ఏండ్లుగా మారుమూల ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు నోటుపుస్తకాలు, పలకలు, బ్యాగులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దీంతో పాటు బడిబయటి పిల్లలను బడిలో చేర్పించే విధంగా దాతల ద్వారా సహాకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచ్ అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ గోపాల్ రాఠి, కోశాధికారి అరుణ్ సారడా, మాజీ అధ్యక్షులు సన్ని అగ్రవాల్, గోపాల్ రాఠి, భరత్ దేవడా, మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, పాఠశాలల ఉపాధ్యాయులు నర్సిరెడ్డి, అక్రమ్, చిరంజీవి, మాన్య, ప్రశాంత్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.



