బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం దుర్మార్గం
– ప్రభుత్వానికి, నాయకులకు గుణపాఠం తప్పదు
– జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దుర్మార్గమని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు రాజుగౌడ్ ద్వజమెత్తారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లుపై హైకోర్టు స్టే విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ స్టేకు కారకులైన కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులకు భవిష్యత్తులో సమాధానం ఇస్తామన్నారు. 1991లో బీపీ మండలి కమీషన్ వేసినప్పుడు బీసీల రిజర్వేషన్లను అడ్డుకున్న వారి వారసులే నేడు కూడా రిజర్వేషన్లను అడ్డుకున్నారని విమర్శించారు. దేశంలో 90శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎసీ, మైనార్టీలు ఉండగా 10శాతం ఉన్న వర్గాలు బీసీలను అణగదొక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

స్థానిక సంస్థలలో 42శాతం రిజర్వేషన్లతో పాటు 65శాతం ఉన్న బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలని, ఇందుకు భవిష్యత్తు ప్రభుత్వాలు సహకరించాలని అన్నారు. తాజాగా బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. తాజా పరిణామాలతో బీసీ బిడ్డలు అన్ని గమనించాలని, బీసీల అభివృద్ధికి పాటుపడే వారికి అండగా నిలవాలని అన్నారు.

ఇదికూడా చదవండి…

