భాయ్‌కి.. రక్షాబంధన్..!
– ముస్లిం సోదరులకు రాఖీ కట్టిన మహిళ నేతలు
– తాండూరులో వెల్లివిరిసిన మతసామరస్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూవులు అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ పండగ తాండూరులో మతసామరస్యతను చాటింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా తాండూరు మహిళ నేతలు ముస్లిం సోదరులకు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీకి రాఖీ కట్టారు.

గత 8 ఏండ్లుగా కోట్రిక విజయలక్ష్మీ సాజిద్ అలీకి ప్రతి యేడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా తన ఇంట్లో రాఖీ కట్టి.. సన్మానించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుత మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు కూడ ప్రతి యేడాది ముస్లిం సోదరులకు రాఖీ కడుతున్నారు. గురువారం తన నివాసంలో కులమతాలకు అతీతంగా యువనాయకులు ఇంతియాజ్, ఇర్షాద్ తదితరులకు రాఖీ కట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నా చెల్లెల్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ కుల, మతాలకు అతీతమని పేర్కొన్నారు. సమాజంలో అన్ని వర్గాలు కుల మతాలకు అతీతంగా మెలిగితే అనుబంధాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు.



