తాండూరు ప్రజలకు గొల్డెన్ న్యూస్..!
– మట్టి వినాయకులను పూజిస్తే
– బంగారు, వెండి నాణేల గిఫ్ట్
– ప్రకటించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గొల్డెన్ న్యూస్ చెప్పారు. ప్రజలు పర్యావరణ పరిరక్షణకు పాటుపడేలా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వినాయక చవితి ఉత్సవాలలో అందరు మట్టి వినాయకులకు జైకొట్టే విధంగా ప్రణాళిక సిద్దం చేశారు. మట్టి వినాయకులను పూజించిన వారికి బంగారు, వెండి నాణేలను అందిస్తామని ప్రకటించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్వయంగా ఈ ప్రకటన చేశారు. రాబోయే వినాయక చవితికి మీరందరూ మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలనే ఉద్దేశంతో సెల్పీ విత్ గణేషా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. చవితి ఉత్సవాలలో మట్టి విగ్రహాలు ప్రతిష్టిస్తే నీటిలో తొందరగా కరిగిపోతాయని, అదే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు అయితే నీటిలో కరగకుండా పర్యావరణాన్ని దెబ్బతీస్తోందన్నారు. నీరు కలుషితం అవ్వడమే కాకుండా భూగర్భజలాలు పూర్తిగా కాలుష్య కాసారాలుగా మారుతాయన్నారు. అందుకే మనమందరం మట్టిగణపతినే వాడాలని విజ్ఞప్తి చేశారు. మట్టి విగ్రహాలను పూజించడం వలన భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని అందించిన వారమవుతామన్నారు. పండుగ రోజు మీరందరూ మట్టి గణపతిని పూజించి.. పూజ అనంతరం మీరందరూ ఓ సెల్ఫీ దిగి, ఫోటో, వీడియో తీసి సెల్: 95503 54966 నెంబర్ కు వాట్సాప్ చేయాలన్నారు. లక్కీ డ్రాలో మొదటి 10 మంది విజేతలకు 1 గ్రాము బంగారు నాణెం, తరువాతి 50 మంది విజేతలకు 10 గ్రాముల వెండి నాణెం అందిస్తామన్నారు. కావున అందరు మట్టి వినాయకున్ని ప్రతిష్టించి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) తదితరులు పాల్గొన్నారు.



