రాజీవ్ కాలనీలో డేంగీ కేసు..!
– అప్రమత్తమైన వైద్యాధికారులు
– మున్సిపల్ సిబ్బందితో మందుల పిచికారి
– జ్వరం సర్వే నిర్వహించిన వైద్య సిబ్బంది
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి రాజీవ్ గృహ కల్ప కాలనీలో డేంగీ కేసు నమోదయ్యింది. కాలనీలోని 28వ బ్లాకులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి జ్వరం బాధపడుతున్నాడు.

సోమవారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా డేంగ్యూ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డా. అక్షయ్ తో వైద్య సిబ్బంది బృందం కాలనీలో పర్యటించారు. డేంగ్యూ బాధితుని ఇంటి పరిసర ప్రాంతాల్లో సర్వే చేశారు. ఎవరైనా జ్వరం బారిన పడ్డారా అనే వివరాలను ఆరా తీశారు.

అదేవిధంగా మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాల్లో మందుల పిచికారి చేయించారు. ఈ సందర్భంగా డా. అక్షయ్, వైద్య సిబ్బంది స్థానికులకు డేంగ్యూ, మలేరియా వ్యాధులపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జ్వరం బారిన పడితే ఆసుపత్రిలో చూపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు మున్సిపల్ జవాన్ సిహెచ్ అశోక్, కార్మికులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

