సమైక్యత ప్రతిబించేలా వత్రోత్సవాలు
– 15వేల మంది ర్యాలీకి పక్కా ఏర్పాట్లు
– మూడు రోజుల వేడుకలకు ముమ్మర చర్యలు
– అధికారుల సమీక్షలో తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర వైభవం ప్రతిబించేలా 16వ తేది నుంచి 18వ తేది వరకు నిర్వహించే జాతీయ సమైక్యత వత్రోత్సవాలు జరుపుకోవాలని తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ అన్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత పత్రోత్సవాల కార్యక్రమాలపై గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ వజ్రోత్సవాల నోడల్ ఆఫీర్, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కోటాజీ, తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం తాండూరు పట్టణంలో 15 వేల మందితో జాతీయ జెండాలతో నిర్వహించే ర్యాలీకి ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. విద్యార్థులతో పాటు నిర్వహించే ఈ ర్యాలీలో ప్రజా ప్రతినిధులు, సంఘాల సభ్యులు, అధికారులు పాల్గొనేలా బాధ్యత తీసుకోవాలన్నారు. ఉదయం 10-30 గంటలకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ర్యాలీ చేపట్టి విలియమూన్ స్కూల్ గ్రౌండ్‌కు చేరుకోవాలన్నారు. ర్యాలీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసు శాఖ చర్యలు చేపట్టాలన్నారు. ర్యాలీలో పాల్గొనే వారికి భోజన వసతి కూడ కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 17వ తేదిన జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు. తాండూరు పట్టణం, మండలాల్లో జాతీయ పతావిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 18వ తేదిన పట్టణ, మండలాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కోటాజీ మాట్లాడుతూ 17వ తేదిన హైదరాబాద్‌లో జరిగే సీఎం బహిరంగ సభకు ప్రజా ప్రతినిధులను, ప్రజలను భారీగా తరలించాలన్నారు. ఇందుకోసం బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తానికి మూడు రోజుల పాటు జాతీయ సమైక్యత వత్రోత్సవాలను వైభవంగా జరుపుకోవాలని, ఈ ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ఔన్యత్యాన్ని ప్రతిబించేలా జరుపుకోవాలని ఆర్డీఓ అశోక్ కుమార్ అన్నారు.

మరోవైపు సమావేశం అనంతరం ఆర్డీఓ అశోక్ కుమార్, నోడల్ ఆఫీసర్ కోటాజీ, డీఎస్పీ శేఖర్ గౌడ్లు విలియమూన్ గ్రౌండ్లో ర్యాలీ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు. సీఐలు రాజేందర్ రెడ్డి, రాంబాబు, ఎంపీడీఓలు సుదర్శన్ రెడ్డి, లక్ష్మప్ప, ఎంఈఓలు వెంకటయ్య గౌడ్, సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ రంగనాథం, ఏఈ ఖాజా, టౌన్ ప్లానింగ్ అధికారి జీషాన్, ఎస్ఐలు, రెవెన్యూ, వైద్య, వ్యవసాయ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


